చారిత్రాత్మక కట్టడాలు.. నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు
చారిత్రాత్మక కట్టడాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారుతున్నాయి. అధికారుల అలసత్వం, క్రమశిక్షణ లేని జనం మూలంగా మురికి కూపంలా మారుతున్నాయి. అందుకు నిదర్శనం పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్.. చార్మినార్ కె అందం తెచ్చి సందర్శకులను అలరించిన నిజాం నవాబు కాలం నాటి ఫౌంటెన్ కి ఇప్పుడు చెద పడుతోంది. మంచినీటికి బదులు మురికి నీరు దాని నిండా కాళీ వాటర్ బాటిల్స్, చెత్త చెదారంతో స్వాగతం పలుకుతోంది. పొరపాటున అటు వెళ్తే మురుగు వాసనతో ముక్కుపుటాలను అదరగొడుతోంది. అధికారులు చరిత్రాత్మక కట్టడాలను రక్షిస్తున్నామని, వాటి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. మరి అలాంటి అధికారులకు ఈ వాటర్ ఫౌంటెన్ కనిపించక పోవడం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి కట్టడాలు కాపాడటమే కాకుండా వాటిని సక్రమంగా ఉండేలా చేయాలని కోరుతున్నారు. గురువారం కురిసిన వర్షానికి చార్మినార్ పై భాగంలో కొంత పెచ్చులూడి పడటం, గుల్జార్ హౌజ్ వాటర్ ఫౌంటెన్ చెత్తతో నిండిపోవడం పలువురిని కలిచివేసింది.