గర్భవతిపై బండరాయితో భర్త దాడి..!
హైదరాబాద్ గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన భార్యపై భర్త బండరాయితో దాడి చేయడంతో.. ఆ మహిళ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్‌తో పరిచయం ప్రేమగా మారడంతో 2024 అక్టోబరులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి. మార్చి 29న షబానా పర్వీన్‌కు వాంతులు కావడంతో రాఘవేంద్ర కాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఏప్రిల్ 1న రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రాగానే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా షబానా పర్వీన్‌పై దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డుపై పెనుగులాటలో కిందపడిన షబానా పర్వీన్‌పై అక్కడే ఉన్న బండరాయితో పదేపదే దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన షబానా పర్వీన్ అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో ఉన్న షబానా పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బస్రత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు..