యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
- ఇటీవల సెల్లార్ తవ్వుతుండగా ముగ్గురు కార్మికుల మృతి
- అది మరవక ముందే సర్కిల్- 5లో మళ్లీ తవ్వకాలు
- చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు
- అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు
హైదరాబాద్ ఎల్బీనగర్‌లోనీ జీహెచ్‌ఎంసీ సర్కిల్-5లో యథేచ్ఛగా ఓ నిర్మాణదారుడు సెల్లార్ తవ్వకాలు సాగిస్తున్నాడు. స్థానిక గోదావరి హోటల్ పక్కన.. రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా.. దర్జాగా సెల్లార్ తవ్వకాలు నిర్వహిస్తున్నాడు. కేవలం 30 ఫీట్ల రోడ్‌లో దాదాపు 20 ఫీట్ల లోతులో సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నాడు. అయినా జీహెచ్ఎంసీ సర్కిల్-5 టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇదే ఎల్బీనగర్‌లో అక్రమంగా ఓ సెల్లార్ తవ్వకాలు జరుపుతుండగా.. మట్టిదిబ్బలు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అయినా.. టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులకు ఆశపడి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో కొద్దిరోజులపాటు నిర్మాణ పనులు ఆపిన సదురు అక్రమ నిర్మాణదారుడు.. తిరిగి అధికారులను మేనేజ్ చేసి పనులు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ సర్కిల్ -5 అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మహా జిమ్మిక్కు...
సదురు అక్రమ నిర్మాణదారుడు అటు అధికారులను.. ఇటు ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త పంథా ఎంచుకున్నాడు. తన ఫోన్ నెంబర్‌ని ట్రూ కాలర్‌లో సీపీ పీఏ అఫీషియల్ అని ఫీడ్ చేసుకున్నాడు. దాంతో అందరూ భయపడి తనను ఎవ్వరూ ప్రశ్నించరు అనే ధైర్యం కాబోలు. దీంతో విచ్చలవిడిగా నిబంధనలను అతిక్రమించి సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఇతడు చేసే అరాచకాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.