సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
రాజీవ్ రహదారి పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వరకూ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ భూ సేకరణ, పునరావాస, పునరుపాధి కల్పన కై తిరుమలగిరి టీచర్స్ కాలనీ, కమ్యూనిటి సెంటర్ లో ఆస్తులు కోల్పోతున్న బాధితులతో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తుందని, వాహనాలు పెరిగిపోతున్నాయని ఈ నేపధ్యంలో రోడ్ల విస్తరణ అనివార్యమని ఎమ్మెల్యే అన్నారు. అయితే ఈ అభివృద్ది కార్యక్రమాల వలన సామాన్యులు నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. స్వార్దపూరిత ఆలోచనతో కొంత మంది అనుమానాలు సృష్టిస్తున్నారని వారి మాటలు నమ్మి ఆందోళనలో పడవద్దని ఎమ్మెల్యే స్ఫష్టత ఇచ్చారు. ఈ కారిడార్ లో భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ రేటు కన్నా అధికంగా సంతృప్తి కరంగా పరిహారం ఇప్పించే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. కొంత మంది కోర్టు కు వెళ్లడం ద్వారా మిగతా వారందరికి నష్టం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా తిరుమలగిరి ఎమ్మార్వో కార్యాలయంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అధికారులు వాళ్ల సందేహాలు నివృత్తి చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే సలహా ఇచ్చారు. ఈ సలహా పై వెంటనే అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ గ్రామసభలో పాల్గొన్న వారు అడిగిన పలు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డిఅర్ఓ వెంకటాచారి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ (ల్యాండ్ ఆక్విజేషన్) అపర్ణ, ఓఎస్డి మనోహర్, తహసీల్దార్ అశోక్, హెచ్ఎండిఏ డి ఈ.ఈ సత్యప్రసాద్, ఏసిపి రమేష్ , కంటోన్మెంట్ అధికారులు, కాలనీ ప్రతినిధులు, ఎలివేటెడ్ కారిడార్ భూనిర్వాసితులు పాల్గొన్నారు.