రాజీవ్ యువ వికాసానికి తెల్ల రేషన్‌కార్డు గండం..!
- ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం
- దరఖాస్తుదారులకు అడ్డంకిగా మారిన తెల్లరేషన్ కార్డు
- పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని బీఆర్‌ఎస్
- రాజీవ్ యువ వికాసం పథకానికి తెల్లరేషన్ కార్డు తప్పనిసరి
- ప్రజాపాలనతో దరఖాస్తు చేసుకోండని ప్రభుత్వ సూచన
- పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకుని కొత్త కార్డుకు దరఖాస్తు
- ఏడాది గడుస్తున్న మంజూరు కానీ తెల్లరేషన్ కార్డులు
- రేషన్‌కార్డు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేని దుస్థితి
- ప్రభుత్వం నిర్వాకంతో అయోమయంలో లక్షలాది దరఖాస్తుదారులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. ఐతే.. ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్లకి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం కింద రుణం మంజూరు కావాలంటే తెల్ల రేషన్‌కార్డు కంపల్సరీ. ఈ నింబంధనే ఇప్పుడు దరఖాస్తుదారుల కొంప ముంచుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ప్రజాపాలన పేరుతో ఊరూరా గ్రామ సభలు నిర్వహించింది. ఇక ఆ సభల్లో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు జనాలు ఎగబడ్డారు. ఐతే.. ఏ ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా.. తెల్ల రేషన్ కార్డును తప్పనిసరి చేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐతే.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లూ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. దీంతో తమ దగ్గర తెల్ల రేషన్ కార్డులు లేవంటూ.. ప్రజాపాలనలో ప్రజలు గగ్గోలు పెట్టారు. ఐతే.. ప్రజాపాలనలోనే రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోండని సర్కార్ సూచించింది. ప్రభుత్వ సూచనతో రేషన్ కార్డులు లేని వారంతా దరఖాస్తు చేసుకున్నారు.
ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఇక్కడే ఒక తిరకాసు వచ్చి పడింది. అదేంటంటే.. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు.. తమ పేర్లను పాత రేషన్ కార్డులో తొలగించుకోవాల్సి ఉంది. దరఖాస్తుదారులంతా అదే పని చేశారు. ఐతే.. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకూ రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. దీంతో ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు.. తెల్ల రేషన్ కార్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు పాత రేషన్ కార్డులో తమ పేరు లేదని.. ఇటు కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నా.. ఇంతవరకు రాలేదని.. లబోదిబోమంటున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. అసలిక్కడ రేషన్ కార్డే లేదు.. ఇక ఆధార్ లింక్ ఎక్కడిదంటూ.. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవడానికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. ఐతే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలన్నా తెల్లరేషన్ కార్డు ఉండి తీరాల్సిందే. సో.. ఈ నిబంధనల వల్ల చాలామంది అర్హత ఉండి కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అందుకనే.. ఈ స్కీమ్ నిబంధనల్ని మార్చి.. గడువు తేదీని కూడా మార్చాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి.
మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. రానున్న పంచాయతీ ఎన్నికల కోసమే.. ప్రభుత్వం ఈ స్కీమ్‌ని తెరపైకి తెచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు.. ఏదో నామ్ కే వాస్తీ కొంతమందికి లోన్లు శాంక్షన్ చేస్తారని.. మిగిలిన వాళ్లకు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పి.. హ్యాండ్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో 6 వేల కోట్ల మంజూరు చేసే ఛాన్సే లేదనే టాక్ వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం నిబంధనల్ని సవరిస్తుందా..? తెల్లరేషన్ కార్డు లేని వాళ్లకి దారి చూపిస్తుందా..? అన్నది వేచి చూడాలి..