బడంగిపేటలో కూల్చివేతలు.. హైడ్రా అధికారులపై దాడికి యత్నం
రంగా రెడ్డి జిల్లా: బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీలో భూ వివాదం కారణంగా హైడ్రాధికారులపై దాడి చేయడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి మరియు ఇతర వ్యక్తులు హైడ్రాధికారులను అడ్డుకోవాలని ప్రయత్నించారు.
భూ యజమానులు 1982లో జిపి లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. సర్వే నెంబర్లు 39, 40, 41, 42, 44లో 5 ఎకరాలు, 7 గుంటల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ లేఅవుట్‌లో 236 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలనీ వాసులు ఈ సమస్యపై హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తిరుమలేష్ తెలిపారు.
హైడ్రాధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, దాదాపు 40 మంది హైడ్రాధికారులు ఈ దర్యాప్తులో పాల్గొన్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు హైడ్రాధికారి తిరుమలేష్ వివరించారు. వారు అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. "హైడ్రాధికారులకు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం" అని ఆయన పేర్కొన్నారు.