ఇక దూకుడే రేవంత్ మంత్రం.
- హై కమాండ్ క్లారిటీతో స్పీడ్
- తనదైన శైలిలో రేవంత్ వ్యూహాలు
- తన వ్యతిరేక వర్గంపై ఫోకస్ చేస్తారా..?
- నాలుగేళ్లలో పూర్తిగా పట్టు సాధించేలా ప్రణాళికలు
- పార్టీతోపాటు ప్రతిపక్షంలో వ్యతిరేక వర్గమే టార్గెట్
- రానున్న కాలంలో రాష్ట్రంలో అరెస్టులు తప్పవా..?
నేను సక్సెస్ సీఎం అనిపించుకోవాలి.. జనం అభినందనలు అందుకోవాలి. ఆ దిశగానే అన్ని వ్యూహాలు ఉంటాయి. దీనికి ఎవరు అడ్డొచ్చినా సరే.. ఎదురొచ్చినా సరే తొక్కుకుంటూ వెళ్లిపోవాల్సిందే. ఇక డోంట్ కేర్.. దూకుడుతో దూసుకుపోవటమేనని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయారని ఒక ఫీలర్ బయటికొచ్చింది. తెలంగాణలో వచ్చే నాలుగేళ్లలో సీఎం మార్పు ఉండదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అంటే రేవంత్‌రెడ్డి ఫుల్ టర్మ్ సీఎంగా పనిచేస్తారన్నమాట. ఈ వ్యవహారంలో క్లారిటీ వచ్చాక.. రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్లో వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో తనకెలాగూ రాష్ట్రంలో ఎదురుండదు. దీంతో అటు పార్టీలో.. ఇటు ప్రతిపక్షంలో కూడా తన దారికి అడ్డు వస్తున్నవారిని రేవంత్ టార్గెట్ చేయనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎదుగుదలను అడ్డుకునే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారట. ఇప్పటికే తన టార్గెట్ లిస్ట్ రెడీ అయిందని.. ఈ నాలుగేళ్లు పూర్తిగా పార్టీతోపాటు రాష్ట్రంలోనూ పట్టు సాధించే దిశగానే రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో తన వ్యతిరేక వర్గంతోపాటు.. అటు ప్రతిపక్షంలో తన గురించి బలంగా విమర్శించేవారే రేవంత్ టార్గెట్ అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న నాలుగేళ్లలో ప్రతిపక్ష నేతల అరెస్టులు కూడా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో తనను జైలుకు పంపించినందుకు రేవంత్ ప్రతీకారం తీర్చుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రానున్న కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇకపోతే.. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ–రేవంత్ రెడ్డికి కాస్త గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. మిగతా సందర్భాల్లో పాలు, పంచదార లాగే సాగిపోతోంది. పార్టీపై రేవంత్‌రెడ్డి ఒకరకంగా పూర్తిస్థాయిలో పట్టు సాధించారని చెప్పవచ్చు. ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలనను పూర్తిచేసుకున్నారు. విజయవంతంగా రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. పథకాల విషయంలో కొన్ని అమలు చేస్తున్నప్పటికీ.. మిగతా వాటికి సంబంధించి అమలు అంతంతమాత్రమే జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆరోపణలు చేస్తోంది. రేవంత్ ఐదేళ్లపాటు పరిపాలన సాగించలేరని.. వచ్చేసారి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టత ఇచ్చారు..
ఇప్పటికే ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి.. వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. తాను ముఖ్యమంత్రి అవుతానని నిండు శాసనసభ వేదికగా ప్రకటించారు. "అనుమానమే లేదు.. ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. నేరుగా ముఖ్యమంత్రి అయ్యాను. ఏడాదిపాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకా నాలుగు సంవత్సరాల పాటు పరిపాలన సాగించాల్సి ఉంది. వచ్చే టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని" రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది..? అనే ప్రశ్న తెలంగాణ రాజకీయాలలో వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. తన నాయకత్వాన్ని అధిష్టానం ముందు ఉంచి.. ముఖ్యమంత్రి అవ్వాలనేదే రేవంత్ ప్లాన్ అని..రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.