ధర లేక పొగాకు రైతుల ఆవేదన..!

By Ravi
On
ధర లేక పొగాకు రైతుల ఆవేదన..!

తక్కువ దిగుబడి వచ్చిన మేలు రకపు పొగాకు పంటకు అధిక ధర దక్కిందని ఆనంద పడాలో.. ఎక్కువ దిగుబడి వచ్చిన పొగాకు పంటను కొనేవారు లేరని బాధపడాలో అర్థంగాక లబోదిబోమంటున్నారు పొగాకు రైతులు. గడిచిన రెండేళ్లు పొగాకు పంటను వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేయడంతో.. ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో అధిక వడ్డీలకు అందినకాడ అప్పులు తెచ్చి పొగాకు పంటను సాగుచేశారు రైతన్నలు. అయితే దిగుబడి తక్కువుగా వచ్చిన మేలురకపు పొగాకును మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎక్కువ దిగుబడి వచ్చిన సెకండ్ గ్రేడ్ క్వాలిటీ పొగాకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. ప్రకాశం రీజియన్ పరిధిలో 2,19,970 ఎకరాల్లో రైతులు పొగాకు సాగుచేశారు. 103.50 మిలియన్ కిలోలకు అనుమతులు ఇవ్వగా 161 మిలియన్ కిలోలు ఉత్పత్తి జరిగినట్లు అంచనా. గతేడాది ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది సాగు పెరిగింది. అయితే డిసెంబరులో కురిసిన అకాల వర్షాలకు తోటలు దెబ్బతిన్నాయి. దీంతో, రెండు, మూడుసార్లు నాట్లు వేయాల్సి వచ్చింది. వాతావరణం సరిగా లేనందున ఎకరాకు రూ.50 వేలు అదనంగా పెట్టుబడి అయిందని రైతులు చెబుతున్నారు. సుమారు ఎకరాకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు దిగుబడి సరాసరి 7నుంచి 8 క్వింటాళ్లు వచ్చిందని.. దీనిలో 10 శాతం మాత్రమే మేలురకపు పొగాకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. మిగతా 90 శాతం మీడియం క్వాలిటీ రావడం, దానికి సరైన ధర రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మేలు రకం పొగాకు ధర కిలో రూ. 300 ఉన్నప్పటికీ మీడియం క్వాలిటీ ధర రూ.230 నుంచి రూ.280  పలుకుతోంది. దీంతోపాటు మీడియం రకం పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి కనపరచకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కిలో రూ.230తో వేలం కేంద్రాలలో పొగాకు ధర ప్రారంభమై గరిష్టంగా రూ.336కు చేరింది. 

IMG-20250406-WA0352

ప్రారంభంలో ధరలు తక్కువుగా ఉండటంతో రైతులు సైతం పొగాకు బేళ్లను వేలం కేంద్రాలకు తెచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. ఒకవేళ తెచ్చినా నాణ్యత లేదంటూ వ్యపారులు కొనుగోలుకు ముందుకు రావడంలేదు. రెండు నెలల తరువాత మంచి రేటు వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. అయితే వాటిని నిల్వ చేసేందుకు కోల్డు స్టోరేజ్‌లు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 40 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. అయితే జిల్లాలో పండిన శనగ, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇప్పటికే వాటితో కోల్డ్ స్టోరేజులు నిండిపోయాయి. ఇక పొగాకు బేళ్లను పెట్టేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు అందుబాటులో లేకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.  వ్యాపారులను సిండికేట్ కాకుండ బోర్డు అధికారులు నిలువరించి గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేలా చూస్తేనే ఈ ఏడాది పొగాకు రైతులు ఒడ్డునపడే పరిస్థితి కనిపిస్తోంది. మరి బోర్డు అధికారులు వ్యాపారులను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.

Tags:

Advertisement

Latest News