వెనుకబడిన కుటుంబాలకు చేయూత -జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
TPN Srikakulam Rajasekhar
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడిన 20శాతం కుటుంబాలకు చేయూతనిచ్చి, వారిని ప్రోత్సహించి ప్రగతి పథం వైపు నడిపించడానికి 'ప్రభుత్వ, ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం' (పి4) అనే వినూత్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పి4 కార్యక్రమంపై జరిగిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. “ఈ కార్యక్రమం ద్వారా ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలను భాగస్వాములను చేసి, వారి సహకారంతో వెనుకబడిన కుటుంబాలను ఆదుకుంటాము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారికి తగిన మార్గదర్శకత్వం, ఉపాధి అవకాశాలు కల్పించి దీర్ఘకాలికంగా వారిని అభివృద్ధి చేస్తాం" అని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖులు ఈ సమావేశానికి హాజరై తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి సహాయపడుతుందని వారు ఆకాంక్షించారు. కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే.. "పి4 కార్యక్రమంలో ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా స్వయం - నిర్వహణ కలిగిన వ్యవస్థను నిర్మించి, ప్రజల నిజమైన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తాం. ఈ కార్యక్రమం ద్వారా భాగస్వామ్యాలను బలోపేతం చేసి, స్పష్టమైన ఫలితాలు సాధిస్తాం. 'స్వర్ణ ఆంధ్ర ఏ2047' దార్శనికతను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని వర్గాల సహకారాన్ని కోరుతోంది" అని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సీపీఓ ప్రసన్న లక్ష్మీ, వివిధ శాఖల అధికారులు, పలు పరిశ్రమల నుంచి ప్రతినిధులు కృష్ణయ్య (ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్), కెవిఎస్ సురేష్ శేషగిరిరావు (ఎన్ఏసీఎల్), రాజేష్ (స్మార్ట్కెమ్), రమేష్ (అక్షయ పైపులు), బంగర్రాజు (శ్యామల పైపులు), విజయ్ (శ్రేష్ పరిశ్రమలు), రాకేష్ (శ్రీకాకుళం గ్రానైట్ అసోసియేషన్), జగ్మల్ (శ్రీకాకుళం గ్రానైట్ అసోసియేషన్), దిలీప్సింగ్ (స్టార్ గ్రానైట్స్), వివిధ రంగాల నుంచి పీ. జగన్మోహన్రావు, బాడాన దేవభూషణ్, పడాల భూదేవి, కొమ్ము రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.