రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి.
పార్వతీపురం, మార్చి 13: పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక డివియం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా పది పరీక్షలు వ్రాసే విద్యార్థి విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల గురించి ఆందోళన చెందవద్దని, పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలన్నారు.
ప్రతీ విద్యార్థిలో సంగ్రాహక శక్తి ఉందని, దానిని సరైన పద్దతిలో ఉపయోగిస్తే విజయం వరిస్తుందని అన్నారు. సంవత్సరం పాటు ఎదురుచూస్తున్న పరీక్షలు వచ్చేసాయని, సంతోషంగా, పండుగలాంటి వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో పది పరీక్షల్లో వ్రాసి, మంచి మార్కులు సాధించాలన్నారు.
అనంతరం విద్యార్దినీ విద్యార్థులకు పెన్ను, ప్లాంక్, వివేకానందుని ఫోటో ను విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డా: తిరుపతి నాయుడు, పాఠశాల ప్రధానోపాద్యాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.