ఫిర్జాదిగూడలో సంబరాలు జరుపుకున్న జనాలు
ఫిర్జాదిగూడలో పండగ వాతావరణం కనిపించింది. కబ్జాల చెర నుంచి దాదాపు 2 ఎకరాల మేర ఉన్న గ్రేవ్‌యార్డును కాపాడుకున్నామని అక్కడి వారు పండగ చేసుకున్నారు. టెంటులు వేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఆనందం పంచుకున్నారు. టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించిందని కొనియాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కంచ పర్వతాపూర్ గ్రామం స్మశాన వాటికలో వెలిసిన అక్రమ లే ఔట్‌ను, కట్టడాలను హైడ్రా గురువారం తొలగించిన విషయం విధితమే. స్మశానవాటికను కాపాడాలని ఏళ్లుగా పోరాడుతున్నాం. మా పోరాటం ఒక పక్క సాగుతుండగానే మరో వైపు అక్కడ కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాను ఆశ్రయించాం. బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్మశానవాటిక స్థలంలో వెలసిన కట్టడాలను ఆ మరుసటి రోజే తొలగించారు. ఇది కదా ప్రజాపాలన అంటూ అభినందిచారు. ఏళ్లుగా ధర్నాలు చేశామని, అధికారులు చుట్టూ తిరిగామని స్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లో పరిష్కారం అయ్యిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులందరికీ అభినందనలు తెలిపారు.