పునాధులతో సహా తొలగించిన హైడ్రా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో హైడ్రా తన తడాఖా చూపింది. కంచ పర్వతాపూర్ గ్రామం స్మశానవాటికలో వెలిసిన అక్రమ లే ఔట్‌ను, కట్టడాలను హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిలో 40 ఏళ్లకు పైగా సాగుతున్న స్మశాన వాటికను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరుపుతున్నారనే ఫిర్యాదుల మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. 3 షాపులతో పాటు.. 15 ప్లాట్లకు వేసిన పునాదులు, రెండు మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రహరీలను, అందులో వేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది.
ఫిర్యాదు అందిందిలా..
ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని కంచ పర్వతాపూర్ గ్రామంలో మైనారిటీలకు సంబంధించిన స్మశానవాటికలు రెండు ఉన్నాయి. వీటిని కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయాలు జరిపారని హైడ్రా ప్రజావాణిలో అక్కడి స్మశాన పరిరక్షక ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సుఖేందర్ రెడ్డికి సర్వే నంబరు 12లో సొంత భూమి ఉంది. తనకి ఉన్న ప్రైవేటు భూమికి పక్కనే సర్వే నంబరు 1లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో ఉన్న శ్మశాన వాటికల స్థలాన్ని కూడా కబ్జా చేసి లే ఔట్ వేశారు. అప్పటికే ఉన్న సమాధులపై మట్టి పోసి అవి కనిపించకుండా చేశారు. ఫిర్జాదీగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, మాజీ కోఅప్షన్ మెంబరు జగదీశ్వర్ రెడ్డితో కుమ్మక్కయిన సుఖేందర్‌రెడ్డి ఈ కబ్జాలకు పాల్పడ్డారు. కరోనా సమయంలో ఇదంతా జరిగింది. లేఔట్ వేసిన నుంచి వివాదం ఉందని తెలిసినప్పటికీ రజనీకాంత్ రెడ్డి అనే వ్యక్తి 200ల గజాల ప్లాట్‌ను కొన్నారు. 3 షాపులు నిర్మించి ప్రతి నెల పెద్ద ఎత్తున్న రెంటులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుదారులు చెప్పారు.
తప్పుడు కేసు వివరాలతో..
ప్రభుత్వ భూమిలో ఉన్న స్మశానవాటికలను కబ్జా చేయడమే కాకుండా.. ఆ లేఔట్‌లోకి వెళ్లకుండా కోర్టు కేసులున్నాయని కబ్జాదారులు నమ్మబలికారు. 15 ప్లాట్ల ప్రహరీలమీద తప్పుడు రిట్ పిటిషన్ నంబర్లను రాయించారు. అటువైపు తాము వెళ్లకుండా అడ్డుకోవడానికే ఇలా చేశారని ప్రజావాణిలో పేర్కొన్నారు. ఇదంతా కొవిడ్ సమయంలో జరిగింది. తన సొంత భూమికి చెందిన సర్వే నంబరు చూపించి తప్పుడు అనుమతులు తీసుకోవడం అక్రమ కట్టడాలు చేపట్టడం జరిగిపోయింది. మాజీ మేయర్, కోఆప్షన్ మెంబరు సహకారంతో ఈ కబ్జాల పర్వం జరిగిపోయింది. తప్పుడు సర్వే నంబరు జోడించి అనుమతులు రావడంలో అప్పటి మున్సిపల్ మేయర్, కో ఆప్షన్ మెంబర్ సహకరించారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. సర్వే చేయించుకుని హద్దులు నిర్ధారించుకోవడం.. కొర్టు ద్వరా హక్కులు పొందకుండా భుజబలంతో సొంతంగా నిర్ణయించుకున్నారని ఫిర్యాదు దారులు వాపోయారు.
ఫిర్యాదుల పరిశీలన ఇలా..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను గూగుల్ మ్యాప్స్, ఎన్ ఆర్ ఎస్ సీ ఇమేజీలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. అక్కడితో ఆగకుండా.. బుధవారం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని స్మశాన వాటికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా, స్థానిక రెవెన్యూ అధికారులతో విచారించి ప్రభుత్వ స్థలమే ఇందులో స్మశానవాటికలున్నాయని నిర్ధారించుకున్నారు. సమాధులు కనిపించకకుండా మట్టితో కప్పినట్టు ఉండడాన్ని కూడా పరిశీలించారు. స్థానికులతో కూడా కమిషనర్ మాట్లాడారు. 7 ఏళ్లుగా ధర్నాలు చేశామని, అధికారులు, కోర్టులు చుట్టూ తిరిగామని శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఈ సంద్భంగా కమిషనర్‌కు తెలిపారు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
హైడ్రా చర్యలు ఇలా..
హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఇక్కడ మూడు షాపులలో సామాన్లను తరలించడానికి కొంత సమయం కావాలని అడగగా వారికి హైడ్రా సహకరించింది. సామాన్లు మొత్తం తరలించిడంలోనూ హైడ్రా సిబ్బంది సహాయం చేశారు. మొత్తం సామాన్లు వాహనాలోకి ఎక్కించిన తర్వాత ఆ షాపులను కూడా హైడ్రా తొలగించింది. 200ల గజాల ప్లాట్లో ఉన్న 3 దుకాణాలతో పాటు పునాదులు వేసి 2 మీటర్ల ఎత్తులో నిర్మించిన 15 ప్లాట్ల ప్రహరీలను హైడ్రా తొలగించింది.