మీ వాట్సాప్ లు జర భద్రం
దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో అటు కేంద్రం..ఇటు పోలీస్ యంత్రాంగం జనాలను అప్రమత్తత చేస్తోంది. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులే కాదు తెలియని నెంబర్ ల నుండి కాల్స్, వాట్సాప్ మెసేజ్, మెయిల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్స్ ఇవ్వొద్దని చెబుతున్నారు. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి అటాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' అనే పేరుతో ఒక ప్రమాదకరమైన మాల్‌వేర్‌ను వ్యాప్తిలోకి తెచ్చి, దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు తదితర సున్నితమైన డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని భారత సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఈ వైరస్‌ను పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసు విభాగం సూచించింది.
పాకిస్థానీ హ్యాకర్లు భారతీయ సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం చూపేందుకు, వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్‌వేర్‌ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, లింకుల ద్వారా ఈ మాల్‌వేర్‌ను ఫోన్లలోకి పంపించి, సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఈమెయిల్స్ ద్వారా కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్‌వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చని వారు హెచ్చరించారు. ఫోన్‌లోని రహస్య ఫైళ్లను యాక్సెస్ చేసి, వాటిని లీక్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా క్రాష్ చేయడం చేయవచ్చని తెలిపారు. మన పరికరాలను రిమోట్‌గా వారి ఆధీనంలోకి తీసుకుని దుర్వినియోగం చేయవచ్చని హెచ్చరించారు. పాకిస్థానీ హ్యాకర్లతో పాటు ఇదే అదనుగా స్థానిక సైబర్ నేరగాళ్లు సైతం రెచ్చిపోయే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్రం వ్యాప్తంగా అన్ని కమిషనరేట్లలో సైబర్ క్రైమ్ అధికారులను అప్రమత్తం చేసి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వాట్సాప్ లో మీకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ లు హ్యాక్ చేసి మొదట ఫోటో పంపడం అది ఓపెన్ చేసిన తరువాత నమ్మకంగా మరికొన్ని ఫొటోస్ అంటూ పంపే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తీరా మోసపోయాక చేసేది ఏమి ఉండదని అందుకే ముందుగా అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. ఒక్కసారి మీ మొబైల్ వాట్సాప్, టెలిగ్రామ్ లలో హిల్లరీ వైరస్ అటాక్ చేసిందో ఇక అంతే సంగతులు అంటున్నారు.. సో బీ కేర్ఫుల్..