మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్
మలక్ పేటలోని మామిడిపండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్ ను వినియోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను పండిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. సలీమ్ నగర్ గోదాంలో 60 వేల విలువైన, శాలివాహన నగర్ లో 3లక్షల 50 వేల విలువైన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. మామిడి పండ్లను విషాపురితంగా మగ్గించి విక్రయిస్తున్న ఇద్దరి వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇళ్లను గోదాంలుగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను పండించేందుకు ఎథిలైన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటిలైడ్ వంటి కెమికల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. కాల్షియం కార్బైడ్ ను పూర్తిగా నిషేధించినా వ్యాపారులు అడ్డదారిలో డబ్బుల కోసం వాడుతున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి పండ్లు తిని ఆస్పతులకు పరుగులు పెట్టేకన్నా తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు.