ఇజ్రాయెల్ లో భయంకర కార్చిచ్చు.
ఇజ్రాయెల్ లో తాజాగా భయంకరమైన కార్చిచ్చు చెలరేగింది. జెరూసలెంలో భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ నగరంలో దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితిని అనౌన్స్ చేశారు. 24 గంటల్లో వేలాది మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా దీనిని అధికారులు తెలిపారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడ్డారు. అయితే ప్రాణనష్టం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కార్చిచ్చు వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలుల వల్ల ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
అయితే ఈ కార్చిచ్చు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారుల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అని అన్నారు. జెరూసలెంను రక్షించుకోవడం ప్రస్తుత ప్రాధాన్యం అని పిలుపునిచ్చారు. టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రోడ్డుని మూసివేశారు. రహదారులు మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. రోడ్డు మార్గంలో మంటలు చుట్టుముట్టడంతో, పలువురు తమ వాహనాలు విడిచిపెట్టి పరిగెడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. కాగా అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచారు.