కుక్కపిల్లల్ని కొట్టి చంపిన సైకో..!
హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో హృదయవిదారకమైన జంతు క్రూరత్వం సంఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఆరు రోజుల వయసున్న కుక్కపిల్లలను గోడకి కొట్టి, అనంతరం తన కాలుతో తొక్కి చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఆ కమ్యూనిటీలో తీవ్ర ఆవేదన కలిగించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన సంఘటన మచ్చ బోలారంలోని ఇండిస్ వీబీ సిటీలో ఏప్రిల్ 14 నాడు జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశిష్ అనే వ్యాపారవేత్త తెల్లవారుజామున 1:20 గంటల సమయంలో సెల్లార్‌లోకి వెళ్లి, అక్కడున్న కొత్తగా పుట్టిన పప్పీలను గోడకి కొట్టి చంపాడు. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలో అతడు సెల్లార్‌లోకి ప్రవేశించి పప్పీలను గోడకి విసిరి, వాటి తలల్ని తన కాలితో తొక్కడం, ఇటుకతో మోది చంపిన దృశ్యాలు కనిపించాయి.
అపార్ట్‌మెంట్‌వాసులు ఉదయాన్నే.. ఆ పప్పీల డెడ్‌బాడీస్‌ను చూసి షాక్‌కు గురయ్యారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి నిజాన్ని గుర్తించారు. దాన్ని చూసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తార్ ఖాన్ అనే నివాసి మాట్లాడుతూ.. "అశిష్ తరచూ వీధి కుక్కల్ని వేధించేవాడు. వాటిమీద రాళ్లు వేసేవాడు, కర్రలతో కొట్టేవాడు. అతన్ని ప్రశ్నించగానే, వీధి కుక్కలంటే తనకు నచ్చదని, అందుకే చంపానని ఒప్పుకున్నాడు. తరువాత క్షమాపణ చెప్పాడు" అని తెలిపారు.
స్థానికుల మాట్లాడుతూ.. కమ్యూనిటీలో తిరిగే ఒక వీధి కుక్క పది రోజుల క్రితం ఐదు పప్పీలకు జన్మనిచ్చింది. అశిష్ ఆ పప్పీలను సెల్లార్‌లో చూసి లక్ష్యంగా చేసుకున్నాడు. అరుణ అనే మరొక నివాసి మాట్లాడుతూ, "అశిష్ మరియు అతని భార్య గోల్డెన్ రీట్రీవర్‌ను పెంచుతారు, బాగా చూసుకుంటారు. అతనిని ప్రశ్నించినప్పుడు అతని భార్యకి ఈ విషయం తెలియదన్న విషయం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఆమె గర్భవతిగా ఉంది" అని చెప్పారు.
జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ, "ఇలాంటి సాడిస్టిక్ చర్యలు పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు కఠినమైన శిక్షలు విధించాలి" అని సూచించారు. అల్వాల్ ఎస్‌హెచ్‌వో రాహుల్ దేవ్ మాట్లాడుతూ, "ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తాం. దర్యాప్తు కొనసాగుతుంది" అని చెప్పారు.