హైదరాబాద్‌లో పాకిస్తానీయులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?
జమ్మూకాశ్మీర్ ఘటన నేపద్యంలో యావత్ భారతదేశం అప్రమత్తమైంది. నిత్యం రద్దీగా ఉండే తిరుమల, యాదగిరిగుట్టతో పాటు పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేస్ ల వద్ద నిఘా పెంచింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందించారు. దీనితో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో నమోదైన పాకిస్థానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.సాధారణంగా విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్..ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓలో నమోదు చేసుకోవాల్సి ఉండగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పాతబస్తీ పురానీ హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విభాగం వద్ద లభించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం హైదరాబాద్ లో మొత్తం 208 మంది పాకిస్థానీ పౌరులు అధికారికంగా నమోదై ఉన్నారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్‌టీవీ) కలిగినవారే. సాధారణంగా ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారికి, వారి రక్త సంబంధీకులకు ఈ రకం వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది స్వల్పకాలిక (షార్ట్ టర్మ్) వీసాలు కలిగి ఉండగా, మిగిలిన వారు వైద్య చికిత్సల నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో, ఈ 208 మంది ప్రస్తుత నివాసాలు, ఇతర వివరాలను ఎస్‌బీ అధికారులు మరోసారి ధ్రువీకరించుకుంటున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిశాక, ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు. గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లు తేలితే, వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఓ ఉన్నతాధికారి వివరించారు. నగరంలో ఉన్న పాకిస్థానీల్లో ప్రస్తుతం సార్క్ వీసా కలిగిన వారు ఎవరూ లేరని కూడా స్పష్టమైంది. అయితే సిటీలో ఉన్న వారి వివరాలు స్పెషల్ బ్రాంచ్ ద్వారా వివరాలు సేకరించిన స్థానిక పోలీసులు వారు ఎక్కడ వుంటున్నారు. ఎమ్ చేస్తున్నారు అనే వివరాలు సేకరిస్తున్నారు. సిటీలో తిష్ట వేసిన వారిని వెనక్కి తిప్పి పంపే ప్రయత్నాలు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. వీరితో పాటు అనధికారికంగా ఉన్న వారి డేటా కూడా సేకరించి వారిని జైల్ కి పంపాలని అధికారులు రెడీ అయ్యారు. స్థానికుల సహకారంతో ఈ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు.