కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!

By Ravi
On
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్‌పైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్‌ను బహిష్కరించేది మావోయిస్టులు మాత్రమేనని అన్నారు. ఆ మావోయిస్టుల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విప్‌లకు భయపడి ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, మజ్లిస్ పార్టీని గెలిపించినా ఆయా పార్టీల కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం కాబోతోందని హెచ్చరించారు. తెలంగాణలోని 85 శాతం హిందువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. విప్‌లకు భయపడి నిర్ణయం తీసుకుంటారో, ఓటింగ్‌కు హాజరై మజ్లిస్‌ను ఓడిస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సూచించారు.
హైదరాబాద్ బర్కత్‌పురాలోని బీజేపీ సెంట్రల్ కార్యాలయంలో నగర కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నేతలకు సంజయ్ దిశానిర్దేశం చేశారు. 

‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్‌ను గెలపించాలని చూస్తున్నాయి. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న మజ్లిస్‌తో కలిసి ఆ రెండు పార్టీలు అంటకాగుతున్నాయి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడవాడలా ప్రచారం చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు వివరించండి. హిందువుల మనోభావాలను వివరించండి. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావును గెలిపించండి.’’అని కోరారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచామని, ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగరవేయడం తథ్యమన్నారు. పార్టీ కోసం, సిద్దాంతం కోసం నిరంతరం పనిచేసిన గౌతమ్‌రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించే అవకాశం వచ్చినందున ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరారు.

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ‘‘ఎన్నికలను బహిష్కరించాలని చెప్పేదెవరు..? మావోయిస్టులు మాత్రమే. ఆ మావోయిస్టుల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు’’అని మండిపడ్డారు. ‘‘10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్. 15 నెలలుగా అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగే ఎన్నికలకు దూరంగా ఉండటం సిగ్గు చేటు. వీళ్లకు అభ్యర్థులే కరువయ్యారని చెప్పడం సిగ్గు చేటు. ఎన్నికలపై, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కానీ 24 మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా దూరంగా ఉండటం హాస్యాస్పదం.’’అని అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు విప్ జారీ చేయనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా ‘‘విప్‌లు, గిప్‌లు  ఏమీ పనిచేయవు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఇంకా 6 నెలలు మాత్రమే. పొరపాటున ఆ పార్టీల విప్‌కు భయపడి కార్పొరేటర్లు మజ్లిస్‌కు ఓటేసినా, ఎన్నికలకు దూరంగా ఉన్నా వాళ్ల పని ఖతమైనట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూకలు చెల్లినట్లే’’అని చెప్పారు. 

‘‘గ్రేటర్ హైదరాబాద్‌లో 85 శాతం మంది హిందువులే ఉన్నారు. గోమాతను వధిస్తున్న వాళ్లకు, 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ప్రగల్భాలు పలికిన మజ్లిస్ వాళ్లను గెలిపిస్తారా..? హిందువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అన్ని డివిజన్లలో హిందూ సమాజమంతా ఒక్కటైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్‌కు ఓటేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీల అధిష్టానాల ఆదేశాలు ముఖ్యమా..? మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా..? తేల్చుకోండి. మజ్లిస్‌ను ఓడిస్తే... మిమ్ముల్ని అక్కున చేర్చుకుని గెలిపించే బాధ్యతను మేం తీసుకుంటాం’’అని స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలే లేవని, ఆ పార్టీల భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. మజ్లిస్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాతబస్తీలో జరిగే బహిరంగ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి  కర్త, కర్మ, క్రియ అంతా కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీ సూచన మేరకు మజ్లిస్ పార్టీ ముస్లిం సంఘాలతో కలిసి బహిరంగ సభ పెట్టారే తప్ప ఆ పార్టీతో అయ్యేదేమీ లేదన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ‘‘తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలముంది. దీనిద్వారా వందల కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సొమ్ముతో ఏ ఒక్క పేద ముస్లిం కుటుంబానికైనా న్యాయం చేశారా..? వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేశారా..? మీకు నిజంగా దమ్మూ  ధైర్యముంటే తెలంగాణలో వక్ఫ్ ఆస్తులెన్ని..? ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి..? వక్ఫ్ ఆస్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తోంది..? అందులో పేదలకు ఎంత ఖర్చు చేస్తున్నారు..? ఆ వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’అని డిమాండ్ చేశారు. గతంలో ట్రిపుల్ తలాఖ్‌పైనా మజ్లిస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ నేతలు ఇట్లనే ఆందోళన చేయాలని కుట్రలు చేశారని, ముస్లిం మహిళలంతా తిరగబడటంతో తోకముడిచిందన్నారు. బీజేపీ నేతలు రాముడి వారసులు కారంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఎవరు రాముడి వారసులో... ఎవరు రామ మందిరం నిర్మించారో... ఎవరు రాముడిని తిట్టారో...అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిందెవరో... 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపేస్తామని ప్రకటించిన వాళ్లకు ఎవరు మద్దతిస్తున్నారో ప్రజలకు తెలుసు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.’’అని మండిపడ్డారు.

Tags:

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం