కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్
పర్యావరణ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదన్నారు రఘునందన్‌రావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యావరణ విధ్వంసం జరిగిందని.. ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, అటవీ భూములే కాకుండా వృక్ష సమృద్ధిగా ఉన్న ప్రాంతాలను కూడా అడవులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 400 ఎకరాల విధ్వంసాన్ని బీజేపీ మొదటి నుంచీ తీవ్రంగా ఖండించిందని చెప్పారు. ఈ బుల్డోజర్ విధ్వంసాన్ని బీజేపీ తరఫున నిరంతరం వ్యతిరేకిస్తూ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్‌ని కలిసి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందంటూ, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసంపై 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు కలిసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు సమర్పించారని చెప్పారు. అటవీ భూముల్లోకి బుల్డోజర్లను పంపడాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు స్పందించారన్నారు. కేటీఆర్ “ప్రధానిగా మోదీ గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది” అంటూ ట్వీట్ చేశారు. మోదీ విధేయతకు తెలంగాణ ప్రజలు గౌరవం చూపారని.. అందుకే రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని.. బీఆర్ఎస్ పార్టీని సున్నా సీట్లకే పరిమితం చేశారని.. మూడోసారి మోదీ ప్రధానిగా రావాలన్నది ప్రజల ఆకాంక్షని.. మోదీ పట్ల ప్రజలకు గల విశ్వాసానికి ఇది నిదర్శనమని చెప్పారు.
మోదీజీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాట్లాడుతున్న కేటీఆర్.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తప్పుల గురించి మాట్లాడటం లేదన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అన్ని డాక్యుమెంటరీ ఆధారాలతో కేంద్ర పర్యావరణ శాఖ ముందు బీజేపీ ఎంపీలు వాదనలు వినిపించారని చెప్పారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత భారత ప్రభుత్వం నూరుశాతం చర్యలు తీసుకుంటుందన్నారు.
కంచె గచ్చిబౌలి భూముల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. సాధికారత కమిటీ ఇంకా కొన్ని ఆధారాలు కోరుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీజేపీ మొదటి నుంచే అడ్డుకుంటూ వస్తోందన్నారు.
పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 111 జీవోను ఎత్తివేసి లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు పదేళ్లు ప్రయత్నం చేసి.. ఎక్కడపడితే అక్కడ ఫాంహౌస్‌లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు పర్యావరణం ఎందుకు గుర్తుకురాలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య విడదీయలేని బంధం ఉందని.. ఇవి నాణేనికి బొమ్మా-బొరుసులా ఉన్నాయని.. పాలసీల పరంగా, వ్యవహారాల్లో రెండూ ఒకేలా ఉన్నాయని చెప్పారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీకే ప్రాధాన్యత ఇచ్చిందని.. అసెంబ్లీలో ఎక్కువ సమయం కేటాయించిందని.. అదే సమయంలో బీజేపీకి కనీస సమయమూ ఇవ్వలేదన్నారు.
గతంలో అసెంబ్లీలో "అక్బరుద్దీన్ ఓవైసీ అనుమతిస్తే మాట్లాడతాం" అని బీఆర్ఎస్ నేతలు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా "అక్బరుద్దీన్ అనుమతిస్తే తెలుగులో మాట్లాడతా"నంటూ చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు ఎంఐఎం పార్టీతో అంటకాగిందని.. ఒకదశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు గంటల తరబడి మాట్లాడే అవకాశం ఇచ్చేవారని.. కానీ అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి కనీసం మూడునిమిషాల సమయం కూడా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రజల గొంతుకగా నిలుస్తుందని.. ప్రజల సమస్యలపై నిరంతరం మాట్లాడుతుందని తేల్చి చెప్పారు.
కేటీఆర్ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉన్నదా..? లేదా..? హరీష్ రావు, కల్వకుంట్ల కవితకు ఫామ్‌హౌస్‌లున్నాయా..? లేదా..? ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవో ఎత్తివేసి, ఎంత ప్రకృతి విధ్వంసానికి పాల్పడిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పరిధిలో రింగ్ రోడ్ చుట్టూ ఉన్న సర్కిల్స్ దగ్గర 50 అంతస్తుల భవనాలకు ఎలా అనుమతులు ఇచ్చారు..? అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు అనుమతించిన హైరైజ్ టవర్లలో ఎక్కడ మొక్కలు నాటారు..? ఎన్ని చెట్లు పెంచారు..? అని ప్రశ్నించారు.
తాను రేవంత్ రెడ్డిని కాపాడుతున్నానని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించటంతో పాటు కేటీఆర్ చేసిన తప్పులనూ ప్రశ్నిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాడుకున్న “జయజయహే తెలంగాణ జననీ జయకేతనం” గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేదని మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రశ్నించింది తానేనని.. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉందన్నారు. హెచ్‌సీయూ భూముల అంశంపై భారతీయ జనతా పార్టీపై, ప్రధాని నరేంద్ర మోదీపై అనవసర విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. జైలుకు వెళ్తే భగవద్గీత చదువుతానని, యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు నిజంగానే జైలుకు వెళ్తే భగవద్గీత చదవుకోవచ్చని.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు కూడా లభించిందని చురకలు అంటించారు.