కాశ్మీర్ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇండియాపై పాకిస్తాన్ కు మొదట్నుండి సరైన అభిప్రాయం లేదు. మరోసారి ఆ దేశం ఇండియాపై అక్కసు వెళ్లగక్కింది. కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి స్పీచ్ ఇస్తూ.. అసిమ్ మునీర్ కాశ్మీర్ టాపిక్ ను హైలెట్ చేశారు. కాశ్మీర్ తమ జీవనాడి అని, దాన్ని మర్చిపోలేమని కామెంట్ చేశారు. విదేశాల్లో ఉన్నవారంతా దేశ రాయబారులు అని, ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందిన వారు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు.
అంతేకాకుండా మీ పిల్లలకు సైతం మన దేశ చరిత్రను, గొప్పతనాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయాలని, హిందువులతో పోల్చుకుంటే, మనం చాలా భిన్నమైన వారమని వారికి ఖచ్చితంగా బోధించాలని అన్నారు. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం అని ఈ సంధర్భంగా అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఈ విషయాలు మీ పిల్లలకు తెలియజేయాలన్నారు. కాగా ఈ విషయంపై పలువురు మండిపడుతున్నారు. పిల్లల్లో ఇంకా దేశాల మధ్య బేధాన్ని నూరి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.