కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన కవిత..!
By Ravi
On
-
వక్ఫ్ బిల్లుపై రాహుల్ ఖామోష్.. ప్రియాంక డుమ్మా..!
-
మైనార్టీలపై గాంధీలది కపట ప్రేమ
-
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు
దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై తమది కపట ప్రేమేనని ఎన్నికల గాంధీలు నిరూపించుకున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అత్యంత కీలకమైన వక్ఫ్ చట్టసవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ ఖామోష్ అయ్యారని.. ప్రియాంకా గాంధీ అసలు సభకే హాజరు కాకుండా డుమ్మా కొట్టారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వక్ఫ్ బిల్లు సందర్భంగా లోక్‌సభలో వెన్ను చూపారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలిద్దరికీ మైనార్టీలు, ముస్లింల సంక్షేమం, సమస్యలంటే పట్టవని రూడీ అయ్యిందన్నారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసే కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. అత్యధిక మంది మైనార్టీ ఓటర్లకు ఎంపీగా ఉన్న ప్రియాంకా గాంధీ సభకే హాజరు కాకపోవడం మరింత దారుణమన్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ తనను తానే రాజ్యాంగ రక్షకుడిగా ప్రచారం చేసుకుంటున్న రాహుల్‌గాంధీ.. లోక్ సభ సాక్షిగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే మౌనంగా ఉండటం వెనుక కారణాలేమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికల గాంధీలకు ఓట్ల సమయంలోనే మైనార్టీలు గుర్తుకొస్తారా అని నిలదీశారు. టోపీలు పెట్టుకొని ఓట్లడిగి గద్దెనెక్కిన తర్వాత మైనార్టీలను నిండా ముంచడమే కాంగ్రెస్ నైజమని తేలిపోయిందన్నారు. దేశంలో మైనార్టీల హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ ప్రగ్భలాలు పలుకుతూ ఉంటారని.. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఎటు వెళ్లారు..? ఎందుకు సభలో మైనార్టీల పక్షాన గొంతు విప్పలేదో చెప్పాలన్నారు. ఇద్దరు గాంధీలు లోక్‌సభ సభ్యులుగా ఉండి మైనార్టీల తరపున వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదంటే ఇది ముస్లింలను నట్టేట ముంచడం కాదా..? అని ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్ మొదటి నుంచి ఒకే స్టాండ్‌తో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల గాంధీల మాదిరి తాము ముస్లింలు, మైనార్టీలకు ద్రోహం చేయలేదన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టసవరణ బిల్లును రాజ్యసభలో బీఆర్‌ఎస్ వ్యతిరేకించిందన్నారు. మైనార్టీలకు అండగా నిలవాల్సిన సమయంలో రాహుల్ గాంధీ వెన్ను చూపించారని.. కీలకమైన సమయంలో కాడి పడేసిన ప్రధాన ప్రతిపక్షనేత రేపు మైనార్టీలు, ముస్లింలకు ఎలా అండగా నిలుస్తారని నిలదీశారు.
Tags:
Related Posts
Latest News
05 Apr 2025 19:46:00
డా. బాబు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్
మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని...