వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!

By Ravi
On
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!

వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి చివర భూముల వరకు రెండు పంటలకు నీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలురైతు సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. వంశధార ఆధునీకరణకు రూ.1500 కోట్లు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని శ్రీకాకుళం రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వంశధార వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. దానిని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ వేయించి నేరేడు దగ్గర బ్యారేజ్ ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. నేరేడు బ్యారేజీ నిర్మించకపోతే రిజర్వాయర్‌కు నీళ్లు రాక చెరువుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార రిజర్వాయర్ ద్వారా చివర భూముల వరకు రెండు పంటలకు నీళ్లిస్తే.. జిల్లాకు ఏడాదికి రూ.2000 కోట్ల ఆదాయం వస్తుందని.. తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి అనుబంధ పరిశ్రమలు వస్తాయని, వలసలు ఆగిపోతాయని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా అభివృద్ధి జరగదని, నదీ జలాలను వినియోగించడం ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుందన్నారు. వంశధార నదిలో సుమారు లక్ష క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందని.. దానిలో ఏపీ వాటా 50 శాతం వంశధార ఎడమ కాలువ ద్వారా 2400 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు నీరు మాత్రమే ఉపయోగిస్తున్నామని.. మిగిలిన నీరు వృథాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు వంశధార నీటిని అనుసంధానం చేస్తే సస్యశ్యామలం అవుతుందన్నారు . మరోవైపు వంశధార బ్యారేజ్ నిర్మించి 50 ఏళ్లవుతోందని.. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని.. అనుకోని ప్రమాదమేదైనా జరిగితే.. జిల్లా 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారేజీ ఆధునీకరణకు రూ.1500 కోట్లు అవసరం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని జరిగే పోరాటాలకు రైతులు సన్నద్ధం కావాలని రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులు పరిశీలన చేయాలని, గ్రామ సభలు జరపాలని సమావేశం పిలుపునిచ్చింది.
Tags:

Advertisement

Latest News