ప్రాణనష్టం దురదృష్టకరం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం - మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- మరో 15 రోజుల్లో ఎస్ ఎల్ బి సీ సహాయక చర్యలు పూర్తి
- పగలు రాత్రి తేడాలేకుండా సహాయక చర్యలు
- మృతుల కుటుంబాలకు త్వరలో నష్టపరిహారం
- రెండున్నర ఏళ్లలో ఈ కాలువ ద్వారా రైతులకు సాగునీరు
పత్రికా ప్రకటన
తేది. 02.04.2025
హైదరాబాద్ _ శ్రీశైలం:- శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( ఎస్ .ఎల్. బి. సి) టన్నెల్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మరో 10 -15 రోజులలో సహాయక చర్యలు పూర్తవుతాయని, నల్గొండ - ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానదీ జలాలు మరో రెండున్నర సంవత్సరాలలో అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు,ఎస్ .ఎల్. బి. సి టన్నెల్ ప్రమాదస్ధలాన్ని పరిశీలించిన అనంతరం శ్రీశైలంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు టన్నెల్‌లో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయని , మరో 105 -110 మీటర్ల మేర త్రవ్వకాలు పూర్తయితే సమస్య ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 250 మీటర్ల మేర రాయి, బంకమన్ను కారణంగా అడ్డంకి ఏర్పడింది. గడచిన 40 రోజులుగా 700-800 మంది వివిధ సంస్ధలకు చెందిన నిపుణులు పగలు రాత్రి అధికారుల పర్యవేక్షణలో పనిచేశారు. ప్రస్తుతం 550-560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్ లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వలన అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహాయక చర్యలు చేపట్టేవారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. కలెక్టర్, ప్రత్యేక పర్యవేక్షణాధికారి శివశంకర్ లోతేటి, విపత్తు నిర్వహణాధికారి, ఎస్పీ తదితరులు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈ సంఘటనలో ఇంతవరకు ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. ఈ ప్రమాదం నేపధ్యంలో టన్నెల తవ్వకం సందర్బంగా భవిష్యత్‌లో ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా సంపూర్ణ చర్యలు చేపడతాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆలోచనలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఇందిరమ్మ పభుత్వ హాయాంలోనే సాగునీటిని అందిస్తాం.ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నారు, ఎప్పటికప్పుడు అక్కడ పేరుకున్న మట్టి, రాళ్ల దిబ్బలు, పూడిక, ఊట నీటిని బయటకు తొలిగిస్తున్నారు.
ఇన్లెట్ వైపు నుంచి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా సాగుతోంది.ఏదిఏమైనా ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి విచారం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి సతీ సమేతంగా శ్రీశైలం భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు.