గిరిజన గ్రామాల పిల్లలు చదువుకోవడానికి కనీసం పాఠశాల కూడా ఏర్పాటు చెయ్యలేరా - లోక్ సత్తా నాయకులు డిమాండ్
విజయనగరం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని గోపాలరాయుడు పేట పంచాయతీ బట్టి వలస గిరిజన గ్రామంలో పిల్లలు చదువు కోవడానికి పాఠశాల కూడా ఏర్పాటు చెయ్యలేని దయనీయ స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయని లోక్ సత్తా పార్టీ నాయకుడు ఆకుల దామోదర రావు ప్రశ్నించారు. గత సంవత్సరం ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది తప్పా ఎలాంటి మార్పు లేదని, ప్రభుత్వాలు మారడం తప్పా ప్రజల జీవితాలు మారడం లేదని, ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన కనీస అవసరాలయిన విద్య, వైద్యం కూడా సరిగ్గా అందించలేని స్థితిలో నేటి ప్రభుత్వాలు ఉన్నందుకు సిగ్గు పడాలని లోక్ సత్తా నాయులకులు మండిపడ్డారు. ఎన్నికల ముందు అధికారం కోసం అలవికాని హామీలు ఇవ్వడం తర్వాత చేతులు ఎత్తేయడం ఇదీ మన నాయకుల తీరని, ప్రస్తుత బట్టి వలస గ్రామం ఒక గిరిజన గ్రామం, ఈ గ్రామానికి దరి దాపులలో మరి ఏ ఇతర గ్రామాలు లేవు. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి పాఠశాల చాలా అవసరం. పాఠశాల భవనం మంజూరయి ఏళ్లు గడుస్తున్నా నిర్మించక పోవడం చూస్తే మన ప్రభుత్వాలకి గిరిజన గ్రామాల అభివృద్ధిపై ఎంత చిత్త శుద్ధి ఉందో అర్ధం అవుతుంది. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆ గ్రామస్తులే పురిపాక నిర్మించారు, అది కాస్త గాలికి ఎగిరి పోతే చర్చి ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నందుకు మనం అందరం సిగ్గు పడాలి. మరి మన పాలకులు, అధికారులు, గిరిజన సంక్షేమ సంఘం అధికారులు ఏమి చేస్తున్నట్టు? గుడి, చర్చి కడుతున్నాం అంటే మన నాయకులు చందాలు ఎగబడి మరీ ఇస్తారు ఎందుకంటే ఓట్లు వస్తాయి కదా, అదే బడి కడతాం అంటే ఎవరూ ముందుకు రారు, పిల్లలకి ఓటు హక్కు లేదు కదా. పాపం ఆ పిల్లలని చూస్తే బాధ అనిపించడం లేదా? అదే మన పిల్లలని అలాంటి బడులకి పంపిస్తామా? మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. కనీసం ఇకనైనా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి బట్టి వలసలో గిరిజన పిల్లలు చదువుకోవడానికి పాఠశాల భవన నిర్మాణం చెయ్యాలని లోక్ సత్తా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను అని దామోదర రావు అన్నారు.