ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ..!
శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు టీడీపీ కార్యాలయానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల సమయానికి దాదాపు వంద మంది వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే ఎమ్మెల్యే శంకర్.. ప్రతి ఒక్కరి సమస్యను చిత్తశుద్ధితో వింటూ తానున్నానని భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామని భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.