ఉగాది రోజు తెలంగాణలో పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు
కొత్త రేషన్ కార్డు లో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటది...చిప్ ఉండదు.
రేషన్ కార్డు పై ప్రధాని ఫోటో పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
30లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేయబోతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ రోజు సెక్రటేరియట్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పథకాలు పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి బాటలు వేస్తున్నాయని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించినట్లు, రేషన్ బియ్యం వినియోగంలో కొంతమంది లబ్ధిదారులు అప్రమత్తత లేకుండా ఉన్నారని, కొందరు బ్లాక్ మార్కెట్‌లో బియ్యం అమ్మడం జరుగుతోందని తెలిపారు. అందుకే, హుజూర్ నగర నుంచి సన్న బియ్యం పంపిణీ మొదలు పెడుతున్నామన్న ఆయన, ఈ చర్య ద్వారా 85% జనాభాకు సన్న బియ్యం అందుబాటులోకి రాబోతుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ లబ్ధిదారుల సంఖ్య 2.85 కోట్లకు చేరిందని, ఈ చర్యతో 10,665 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, వచ్చే నెల నుండి రేషన్ కార్డులు లేని వారికి కూడా సన్న బియ్యం అందజేయబడుతుందని తెలిపారు.
"నాకు తెలిసి, ఈ విధంగా తెలంగాణ చరిత్రలోనే ఉగాది రోజున బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాడు ముఖ్యమంత్రి. ఇది పేదల జీవితాలలో నూతన మార్పును తీసుకొస్తుంది," అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి 49,479 కొత్త కార్డులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో బియ్యం తో పాటు పప్పు, ఉప్పు వంటి వస్తువుల పంపిణీ కూడా చేపట్టనున్నట్లు ప్రకటించారు.