నేరస్థుల ఆటకట్టించడంలో కీలకంగా మారిన సిసి కెమెరాలు
వికారాబాద్ జిల్లా, తాండూరు: తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని కరణ్ కోట్ పోలీసులు ఓ గొర్రెల దొంగతనాన్ని విజయవంతంగా ఛేదించారు. ఈ దొంగతనం క్రమంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి.
వివరాల్లోకి వెళ్ళితే, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే రైతు తన గొర్రెలను మేపుతున్నాడు. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి స్కార్పియో కారులో వచ్చిన దొంగలు అతని ఇంటి దగ్గర ఉన్న పశువుల పాక నుండి 6 గొర్రెలను చోరీ చేశారు.
మరుసటి రోజు, గొర్రెల యజమాని మల్లికార్జున్ కరణ్ కోట్ పోలీస్టేషన్ లో కేసు పిర్యాదు చేయడంతో, ఎస్ఐ విఠల్ రెడ్డి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు తీసుకెళ్లిన మార్గాన్ని సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలను 80 సీసీ కెమెరాలు పరిశీలించారు.
ఈ క్రమంలో సీసీ కెమెరాలు ద్వారా దొంగలు ధారూర్, వికారాబాద్, మన్నెగూడ, చేవేళ్ల, మొయినాబాద్, నార్సంగి, లంగర్ హౌస్, హుమాయూన్ నగర్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్టా, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో స్కార్పియో కారును గుర్తించారు. కమాండ్ కంట్రోల్ లో కూడా సీసీ కెమెరాలను పరిశీలించి, ఓరిస్సా ప్రాంతానికి చెందిన బాబులి, దీపు తమీమ్, సాజిద్, ముస్తఫా అనే గ్యాంగ్‌కు చెందిన నిందితులను గుర్తించారు.
వివరణ ప్రకారం, ఈ గ్యాంగ్ హైదరాబాద్ బొరబండ ప్రాంతంలో పలు చోరీలు చేసి, స్కార్పియో కారుతో ప్రయాణిస్తూ గొర్రెల దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. ఎస్ఐ విఠల్ రెడ్డి, అతని బృందం ఈ నిందితులను అదుపులోకి తీసుకుని 6 గొర్రెలలో 4 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియో కారును కూడా స్వాధీనం చేసారు.
ఈ కేసులో మిగతా నిందితులు పరారీలో ఉన్నారని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. 13 పోలీస్ స్టేషన్లు, 80 సీసీ కెమెరాలు ఆధారంగా 120 కిలోమీటర్లు ప్రయాణించి నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐ విఠల్ రెడ్డి, అతని బృందాన్ని ప్రశంసించారు.
ఈ దొంగతనాన్ని ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పది రోజుల క్రితం నిందితులను గుర్తించారని వెల్లడించారు.