ఏఐ వీడియోలపై రేవంత్ సర్కార్ సీరియస్..!
- హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రచ్చ
- విద్యార్థులతోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆందోళనలు
- నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఏఐ వీడియోలు
- ఏఐ వీడియోలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
- తప్పుడు వీడియోలపై రేవంత్ సర్కార్ సీరియస్
- ఏఐ వీడియోలు పోస్ట్ చేసినవారికి నోటీసులు..?
కొన్నిరోజులుగా హెచ్‌సీయూ భూములకు సంబంధించి మెయిన్‌స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్న ఏఐ వీడియోలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. దీంతో హెచ్‌సీయూ భూములకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అవుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వీడియోలు క్రియేట్ చేసి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అనవసర వివాదాలు సృష్టిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఈ పోస్టుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారి జాబితాను సిద్ధం చేస్తున్నారట. ఇవాళో.. రేపో.. వాళ్లందరికీ నోటీసులు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధమైనట్లు సమాచారం. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌పై కూడా సర్కార్ ఫోకస్ పెంచింది. ఈ పోస్టుల వెనుక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ హస్తమున్నట్లు కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారం ఇంత వివాదాస్పదం కావడానికి గులాబీ పార్టీనే కారణమని ఆరోపిస్తున్నారు.
మరోవైపు హెచ్‌సీయూ భూములకు సంబంధించిన కోర్టు కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 25 ఏళ్లుగా సర్వే నంబర్ 25లోని భూములను ఎటువంటి వివాదాలు లేకుండా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగించిన విషయాన్ని రేవంత్‌రెడ్డికి అధికారులు తెలియజేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి స్టేడియం, పలు ఐటీ భవనాలు, నివాస సముదాయాలు మరియు హెచ్‌సీయూ భవనాలు కూడా ఈ భూభాగంలోనే ఉన్నాయని వారు వివరించారు. ఇక అదే సర్వే నంబర్‌లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన చర్యలు ఇప్పుడు హఠాత్తుగా వివాదాస్పదం కావడంపై సమావేశంలో చర్చించారు. కొందరు వ్యక్తులు బుల్డోజర్‌ల దగ్గర ఏడుస్తున్న నెమళ్లు, గాయపడిన జింకల వంటి తప్పుడు వీడియోలు, ఫోటోలను కృత్రిమంగా సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా.. పలువురు ప్రముఖులు కూడా ఈ తప్పుదోవ పట్టించే వీడియోలు మరియు ఫోటోలను నిజమని భావించి షేర్ చేశారని వారు తెలిపారు.
ఇక ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌లో పర్యటించి, ఈ అంశంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ విభాగాన్ని కలిశారు. అనంతరం ఆమె మంత్రుల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ వివాదాన్ని ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా పరిష్కరించడమే తమ పార్టీ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, చర్చల ద్వారా ఒక మధ్యేమార్గం కనుగొంటామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. మొత్తానికి హెచ్‌సీయూ భూముల విషయంలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.