ఫారం పాండ్స్ నిర్మిద్దాం.... వాన నీటిని ఒడిసిపడదాం

స్వయంగా గునపం పట్టి మట్టిని తవ్వి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

By Ravi
On

పార్వతీపురం (గరుగుబిల్లి), మార్చి 22 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్లను నిర్మించి, వాన నీటిని ఒడిసిపడదామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపు నిచ్చారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకొని, అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకునే సౌలభ్యం కలుగుతుందని అన్నారు. 

ప్రపంచ జల దినోత్సవం సందర్బంగా గరుగుబిల్లి మండలం కొంకడివరం గ్రామంలో సామూహిక ఫారం పాండ్స్ పనులు డ్వామా ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా గుణపం పట్టి మట్టిని తవ్వి ఫారం పాండ్ల పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్త ప్రాణకోటికి జలమే ఆధారమని, జలం లేనిదే.. జీవం లేదని అన్నారు. అటువంటి జలాల ఆవశ్యకతను తెలుసుకొని, వాటిని సంరక్షించు కోవడమే ప్రపంచ జల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మంచినీటి విలువ గురించి అవగాహన పెంచడానికి, మంచినీటి వనరులను తెలివిగా ఉపయోగించుకునేలా పిలుపు నిచ్చేందుకు ప్రతి ఏడాది మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంను జరుపు కుంటున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేశారు. ప్రాణాధారమైన జలాలను ఒడిసి పట్టుకోకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని, వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలను పెంచుకోవడం మానవాళికి చాలా అవసరమని తెలిపారు. జలనిధిలో ప్రజా భాగస్వామ్యం పెరిగేలా గ్రామాల్లోని ప్రజలను, రైతులను అధికారులు చైతన్యపరుస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణాలు చేపడితే వ్యర్థ జలాలు రహదారులపైకి రాకుండా ఇంకుడు గుంతల్లోకి చేరి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. రైతులు పొలాల్లో నీటి కుంటలు, ఫారం ఫాండ్స్ నిర్మించు కోవాలని కలెక్టర్ సూచించారు. భూమికి చేరే ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదేనని, దీన్ని ఒడిసి పడితేనే భూగర్భ జలం పెరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు.భావితరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవలసిన భాద్యత మనందరిపై ఉందని, భూగర్భ జలాలు పెంపొందించడం వలన అటు పంటపొలాలు,ఇటు ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.  అనంతరం ఇప్పటికే ఫారం పాండ్ల పనులు ప్రారంభించిన రైతు అల్లు తిరుపతినాయుడును కలెక్టర్ ఈ సందర్బంగా దుస్సాలువతో ఘనంగా సత్కరించారు.

ఈ పర్యటనలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె.రామచంద్ర రావు,జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, గరుగుబిల్లి మండల తహశీల్దార్ పి.బాల, యంపిడిఓ జి.పైడితల్లి, సర్పంచ్ అల్లు అప్పల నాయుడు, రైతులు, తదితరులు పాల్గొన్నారు..

Tags:

Advertisement

Latest News