కొనుగోలు సమస్యను పరిష్కరించలి

By Ravi
On
కొనుగోలు సమస్యను పరిష్కరించలి

  •  కంపెనీల మోసాలతో నష్టాపోతున్న కోకో రైతులు
  • అంతర్జాతీయ మార్కెట్ ధర అందించాలి 

ఏలూరు : కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు తెలిపారు. గురువారం పెదవేగి మండలం  గాంధీనగర్ లోని సీతారామ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు బొల్లు రామకృష్ణ, బోళ్ళ సుబ్బారావు,ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు తీసుకొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతుల తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రస్తుతం కోకో సాగు సంక్షోభంలో ఉందని, రైతులు నష్టాల్లో ఉన్నారన్నారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాలలో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందన్నారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం 20వ స్థానంలో ఉందన్నారు.  మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదు. 80% కోకో ను ఇతర దేశాల నుండి మన దేశం దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం కంపెనీలు పోటీపడి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా  కిలో గింజలను రూ.1040/- వరకు కొనుగోలు చేసి,ఈ సంవత్సరం కంపెనీలు సిండికేట్ గా మారి అంతర్జాతీయ ధర ఇవ్వడం లేదన్నారు.  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ కోకో రైతులం సంఘటితంగా లేకపోవడం వలన కంపెనీలు సిండికేట్ గా మారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయన్నారు. పాత గింజల కొనుగోలుపై కంపెనీలు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కంపెనీలు మాత్రం ఆన్ సీజన్ గింజలు కొనలేమని,నాణ్యత లేదని బుకాయిస్తూ రోజురోజుకీ ధర తగ్గించి వేయడం దారుణమని విమర్శించారు. కొత్త గింజలు రూ.650 నుండి రూ.600 లకు ఇప్పుడు రూ. 550 లకు ధర తగ్గించారని,ఈ ధర మరింత తగ్గిస్తామని కంపెనీలు రైతులను బెదిరిస్తున్నాయన్నారు. కోకోగింజల సమస్యల పరిష్కారం కోసం కోకో రైతులు అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం  పరిధి ఆయిల్ పామ్ రైతుల సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకటరావు, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు హాజరయ్యారు. 24న ధర్నాలు,రాస్తారోకోలు కోకో గింజలు కొనుగోలు సమస్యపై ఈనెల 24,25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గోడౌన్స్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది.

Tags:

Advertisement

Latest News