మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోండి
జిల్లా వైద్య శాఖ అధికారి కి కలిసిన ఏఐవైఎఫ్ నాయకులు
TPN Srikakulam Rajasekhar
Date 20/03/25
జిల్లా స్థాయిలో ప్రతి చోటా జరుగుతున్న మెడికల్ మాఫియాను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ లు ఈరోజు జిల్లా వైద్య శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అనేక హాస్పిటల్ లో ధరల పట్టికను డిస్ప్లే చేయకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా ప్రజల వద్ద వేలాది రూపాయలను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ టెస్ట్లు, ల్యాబ్, స్కానింగ్ రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని, స్కానింగ్లు అవసరం లేనప్పటికీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ స్కానింగ్ తీసి సొమ్మును దోచుకుంటున్నారని అన్నారు. హాస్పిటల్ నుండి పేషెంట్లు డిశ్చార్జ్ అయిన తర్వాత వారికి బిల్లులు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు. కమిషన్లకు అలవాటు పడి ఫార్మా కంపెనీలు, మెడికల్ ఏజెన్సీలు బోగస్ మందులను విక్రయిస్తూ వ్యాపారాలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో ఉన్న డాక్టర్లు సేవా దృక్పథాన్ని పక్కనపెట్టి వ్యాపార దృక్పథంతో పేద,మధ్యతరగతి , బలహీన వర్గాల ప్రజల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటున్న పరిస్థితి జిల్లా మొత్తం వ్యాపించిందని, జిల్లాలో కొన్ని హాస్పిటల్స్ కు పర్మిషన్, ఫైర్ సేఫ్టీ లేకుండా యాజమాన్యం హాస్పిటల్స్ ను నడుపుతున్నాయని అదేవిధంగా జిల్లాలో చాలామంది ఆర్ఎంపీ డాక్టర్స్ పర్మిషన్స్ లేకుండా క్లినిక్ లు ఏర్పాటు చేసుకున్నారని వెంటనే వీరి ఆగడాలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఏఐవైఎఫ్ గా అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు R.అరవింద్ , టి. మధు, జి. వసంత్, జె. కుమార్ తదితరులు పాల్గొన్నారు.