మురుగుతో సతమతమవుతున్న ముత్తంగి విజేత కాలనీ వాసులు
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ముత్తంగి విజేత కాలనీలో దారుణమైన డ్రైనేజీ సమస్య నెలకొంది. మురుగునీరు నిండిన వీధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.శ్రీ శివాలయ కమిటీ పేరుతో మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసిన ఫలితం లేకపోయింది. గత కొంత కాలంగా ముత్తంగిలోని పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. మురుగునీటితో నిండిన రోడ్ల కారణంగా ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు వెళ్లడానికి వీలులేక రాకపోకలు స్తంభించాయి. అత్యవసర పరిస్థితుల్లో సైతం సకాలంలో వైద్య సహాయం అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఈ సమస్యపై స్థానిక ప్రజలు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాజకీయ నాయకులు విస్మరించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ శివాలయ కమిటీ సభ్యులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని, ప్రజల ఆరోగ్యానికి, సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ముత్తంగి ప్రజల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది.