హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తొలి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు . దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలు ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ప్రజలు అక్కడ జీవించే పరిస్థితి లేదు. దేశంలోని అనేక మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలి. చిన్న వర్షం పడితే హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయి. భవిష్యత్ లో అలాంటి పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేశాం' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసింది. 1908లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం. బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్న పరిస్థితి. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
"హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నాం. చెరువులను , నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం. అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా... ప్రజలకోసం మేం వెనక్కి తగ్గేది లేదు. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధైతుంది. ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుంది. ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు మీ బాధ ఎంది? వాళ్లు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారు. గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా...? నాపై కక్ష ఉంటే నాపై చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు. వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు హైదరాబాద్ లోని ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రా అవతరించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అధికారాలు ఇచ్చారని స్పష్టం చేశారు. బుల్కాపూర్ నాలాకు సంబంధించిన సమస్యను హైడ్రా ఒక రోజులోనే పరిష్కరించిందని అన్నారు. దుండిగల్ లో రెండు చెరువుల మధ్య ఉన్న నాలా సమస్యను పరిష్కరించి అక్కడి ప్రజలకు ఊరట కల్పించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రంలో భూ కబ్జాలు.. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్లో ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.