పీఎం మోదీతో అజిత్ దోవల్ మీటింగ్.
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఆ దాడికి భారత్ ఆన్సర్ ఇచ్చేలా సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నేడు మరో కీలక సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీతో నేషనల్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించారు. వీరిద్దరి మధ్య భేటీ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేంద్ర హోంశాఖ కూడా కీలక సమావేశం నిర్వహించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని రెడీ చేసేందుకు మే 7న మాక్ డ్రిల్ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రహోం శాఖ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పులు చేసిన వారికి, ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనీవినీ ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో రేపు నిర్వహించనున్న మాక్ డ్రిల్స్‌లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, పాఠశాలల విద్యార్థులను దీనిలో భాగస్వాముల్ని చేయనున్నారు.