మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు..
భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ తాజాగా ఓ నేషనల్ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్‌పుత్ సిందార్ అనే వ్యక్తి మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కూడా బెదిరింపులు వచ్చాయి.
ఐ కిల్ యూ అంటూ ఈ మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గౌతీ ఫిర్యాదు చేశాడు. 2023 ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా మహ్మద్ షమీ టీమిండియాకు దూరమయ్యారు. ట్రీట్ మెంట్ తర్వాత చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐదు మ్యాచ్ ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి.. ఈ టోర్నమెంట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ లో హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.