డ్యామ్ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..
పహల్గాం ఉగ్రదాడికి భారత్ సైలెంట్ గా ప్రతీకార చర్యలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాగ్ లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా.. తాజాగా సలాల్ డ్యామ్‌ను కూడా క్లోజ్ చేసింది. ఇప్పుడు ఈ రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్ కు తెలియజేయలేదు. ఫస్ట్ టైమ్ ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకొన్న మొదటి చర్యగా నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఒక రిజర్వాయర్‌లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్‌కు నీటి కరవు తప్పదు.
కాగా ఈ డ్యామ్‌లపై మొదలైన పనుల గురించి, ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక బురదను, నీటిని బయటకు పంపే ఫ్లషింగ్ ప్రక్రియ కారణంగా విద్యుత్తును మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేసే అవకాశంతో పాటు.. టర్బైన్ దెబ్బతినకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో.. పాక్‌కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్‌కు లేదు. మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి కుష్వీందర్ వోహ్రా పేర్కొన్నారు.ఇక ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తే, ఎదుర్కొనేందుకు పాక్ వద్ద పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై ఏదైనా సంప్రదింపులు జరిగినా భారత్ నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంది.