సూర్య, వెంకీ ప్రాజెక్ట్ కి రికార్డ్ స్థాయిలో బడ్జెట్?
లేటెస్ట్ గా సూర్య రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో ఓపెనింగ్స్ నిలబెట్టినా, సినిమా లాంగ్ రన్ లో కష్టమేననే మాట వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే, సూర్య తన నెక్ట్స్ సినిమాని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నాడు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, తమిళ హీరో ధనుష్‌తో సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన సూర్యతో సినిమా చేయబోతున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా అద్భుతంగా నచ్చడంతో పాటు, వెంకీ చెప్పిన కథ కూడా బాగా నచ్చడంతో సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాకి 120 కోట్ల రూపాయల బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారని, అందులో 50 కోట్ల రూపాయలు కేవలం సూర్య రెమ్యూనరేషన్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. అయితే, సూర్య ట్రాక్ రికార్డ్‌ను బట్టి పరిశీలిస్తే, ఇది బాగా భారీగా ఖర్చు పెట్టబోతున్న సినిమాగా నిలవబోతుంది. ఎందుకంటే, సూర్య సాలిడ్ హిట్స్ కొట్టి కొన్ని ఏళ్ళు అవుతోంది. నిజానికి, డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి చాలా కాలంగా సూర్య ప్రయత్నిస్తున్నాడు. చివరకు ఈ సినిమా దొరకడంతో, ఆయన ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, దాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నాడు.