వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో అని పాకిస్తాన్ భయపడుతుంది. దీంతో, పాక్ సైన్యం అంతా హై అలర్ట్‌లో ఉంది. మరోవైపు, దాని భయాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆయనతో పాటు పాక్ సైన్యంలో ముఖ్యమైన జనరల్స్ తన ఫ్యామిలీలను లండన్, న్యూ జెర్సీతో పాటు ఇతర విదేశాలకు పంపినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘర్షణను ఆపేలా భారత్‌కి నచ్చజెప్పాలని పాక్ ప్రధానితో పాటు ప్రభుత్వం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితిని కూడా కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ భారత్ తప్పకుండా దాడి చేస్తుందని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వం, ఆ ప్రాంతంలోని మతపరమైన కార్యకలాపాలను, వేల సంఖ్యలో మదర్సాలను 10 రోజులు పాటు మూసేయాలని ఆదేశించింది. పీఓకేలో ఉన్న ఉగ్రవాదులు అంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారి స్థావరాలు, లాంచ్ ప్యాడ్స్ మొత్తం ఖాళీ అయినట్లు సమాచారం. భారత దళాలు మదర్సాలను టార్గెట్ చేసుకుంటాయని పాక్ భద్రతా అధికారులు భయపడుతున్నామని పీఓకే మత వ్యవహారాల శాఖ డైరెక్టర్ హఫీజ్ నజీర్ అహ్మద్ రాయిటర్స్‌తో అన్నారు.