కీలక ఒప్పందంపై సంతకం చేసిన ఉక్రెయిన్, అమెరికా
ఉక్రెయిన్, అమెరికాల మధ్య ఫైనల్ గా ఖనిజాల తవ్వకాల ఒప్పందం కుదిరింది. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఫస్ట్ డిప్యూటీ ప్రధాని యులియా సిర్దెంకో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో ఉక్రెయిన్ లో అరుదైన సహజ వనరులు అయిన అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి లభించినట్లైంది. ఈ ఒప్పందం కుదరడం వల్ల ఉక్రెయిన్ లో అమెరికా సంయుక్త నిధిని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో యూఎస్ పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది.
అంతేకాకుండా ఈ ఒప్పందం కుదరడంపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్ట్ ను షేర్ చేసింది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించడానికి ఉక్రెయిన్, అమెరికాలు సంతకం చేశాయి. స్వేచ్ఛాయుత, సంపన్నమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ నిబద్ధతను ఈ చరిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్యం సూచిస్తుంది అని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు చాలా రోజులుగా తెరవెనుక ప్రయత్నాలు సాగించాయని సమాచారం.