పహల్గాం దాడి ఘటన వీడియోలు రిలీజ్?
పహల్గాం ఉగ్రదాడితో ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడింది. ఆ ఘటన వీడియోలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్‌లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని కూడా ఆలోచిస్తుంది. పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
భారత్ చేపట్టిన పలు చర్యలతో పాకిస్తాన్ దేశం అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. ఇక నిన్న ప్రధాని మోదీ నివాసంలో నిర్వహించిన కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు గంట పాటు జరిగిన భేటీలో దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.