సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం
ఏపీలోని విశాఖ జిల్లాలో సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇక పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా సైతం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇక క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25లక్షల చొప్పున సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.3లక్షల పరిహారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు.