ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు
స్కూళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో ఆప్ మాజీ మంత్రులు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ లు ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్ ప్రభుత్వ హయాంలో సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణంలో రూ.2వేల కోట్ల అక్రమాలు జరిగాయి. 34 మందికి దీని కాంట్రాక్టులు దక్కాయి. వారిలో చాలామందికి ఆప్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది.
నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి కాకపోగా, భారీగా ఖర్చు చేశారు. తరగతి గదులను 30 సంవత్సరాలకు ఉండేలా కడితే.. వాటికి అయిన ఖర్చు మాత్రం 75ఏళ్లు ఉండేలా అయ్యింది. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించుకోవడంతో దాదాపు ఐదు రెట్లు ఖర్చు పెరిగిపోయింది. ఇటీవల సెట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది.