దేశాన్ని వీడిన 786 మంది పాక్ పౌరులు..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది పాక్ పౌరులు భారత్‌ను వీడినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 24 నుండి 29 మధ్య పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దు గుండా 786 మంది పాకిస్థానీయులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో పాక్ నుంచి 1,376 మంది భారతీయులు అదే సరిహద్దు గుండా దేశంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పాక్ పౌరులు తమ కుటుంబాలను వదిలి స్వదేశానికి తిరిగి వెళ్తుండడంతో సరిహద్దుల వల్ల ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
సార్క్ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 26, మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 డెడ్‌లైన్ గా విధించారు. అంతేకాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని స్వదేశాలకు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా నివాసం ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించింది. వారిని వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.