భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
భూదాన్ భూముల కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ వివాదంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తదుపరి వాదనలను సింగిల్ బెంచ్ ముందే వినిపించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లలో గల భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతరులు అక్రమంగా పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ బిర్ల మల్లేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఏప్రిల్ 24న కీలక ఆదేశాలు జారీ చేసింది. సదరు భూములను ఏప్రిల్ 27 నుంచి నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సంబంధిత సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 194లో ఉన్నది పట్టా భూమి అని, భూదాన్ భూమి కాదని కోర్టుకు తెలిపారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే సింగిల్ బెంచ్ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని వారు వాదించారు. పిటిషనర్ కోరిన దానికంటే ఎక్కువ ఉపశమనాన్ని సింగిల్ బెంచ్ కల్పించిందని, పిటిషన్‌ను ఉపసంహరించుకోవద్దని రిజిస్ట్రీని ఆదేశించే అధికారం కూడా సింగిల్ బెంచ్‌కు లేదని వారు పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి వాదనలను సింగిల్ బెంచ్ ముందే వినిపించాలని ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులకు సూచించింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతానికి అమల్లోనే ఉండనున్నాయి.