గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..!

By Ravi
On
గాయత్రి పోస్టులతో ఇరకాటంలో టీడీపీ..!

- మరోసారి లిమిట్స్‌ క్రాస్‌ చేసిన గాయత్రి
- పాకిస్తాన్‌ ఎక్స్‌ హ్యాండిల్స్‌లో హిందువులపై అభ్యంతకర పోస్టులు
- ఇండియాతోపాటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు
- గాయత్రి పోస్ట్‌లపై దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న హిందువులు
- సోషల్‌ మీడియాలో గాయత్రిని ఏకిపారేస్తున్న నెటిజన్స్‌
- మిస్టర్‌ చంద్రబాబునాయుడు అంటూ ఎక్స్‌లో కామెంట్స్‌
- గాయత్రి పోస్టులపై టీడీపీ కార్యకర్తల్లోనే అభ్యంతరం
- గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన టీడీపీ

టీడీపీ అధికారిక ప్రతినిధిగా చెప్పుకునే గాయత్రి ఉప్పలపాటి మరోసారి లిమిట్స్‌ క్రాస్‌ చేశారు. ఈసారి ఎక్స్‌ వేదికగా పాకిస్తాన్  హ్యాండిల్స్ హోస్ట్‌ చేసిన స్పేస్‌లో చేరి.. భారత్‌, హిందువులతోపాటు సీఎం చంద్రబాబుపై కూడా అనుచిత కామెంట్స్‌ చేశారు. ఆమె ఎక్స్‌ పోస్ట్‌లు జాతీయ స్థాయిలో టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఏపీ పురోగతి వైపు పయనిస్తున్న కీలకమైన సమయంలో టీడీపీ కూటమి ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎక్స్‌లో పాకిస్తాన్ హోస్ట్‌ చేసిన స్పేస్‌లో.. గాయత్రి చేసిన పోస్ట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు భగ్గుమంటున్నారు. ఇక ఆమె చేసిన పోస్ట్‌లను గమనిస్తే.. "భారతదేశంలో యుద్ధం జరుగుతోంది.. హిందువులు హిందువులతో పోరాడుతున్నారు" అని పేర్కొన్నారు. ఇది భారతదేశ ఐక్యతకు ప్రత్యక్ష అవమానం. ఇంకా దారుణంగా భారత్‌ పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేయడంపై కూడా ఆమె ఎక్స్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. నీటి విడుదల పాకిస్తాన్‌లో వరదలకు కారణమవుతుందని తెగ బాధపడ్డారు. ఇది పూర్తిగా దేశద్రోహ వ్యాఖ్య కిందకే వస్తుంది. అంతేకాకుండా.. ఆమె భారతీయులకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు. అదేంటంటే.. పాకిస్తాన్‌ను విమర్శించవద్దట. ఈ పోస్టులతో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న దేశంపై తన సానుభూతిని బయటపెట్టుకున్నారు. అంతటితో గాయత్రి ఆగలేదు. హిందూ పవిత్ర గ్రంథాలైన రామాయణం, మహాభారతాలు అత్యాచారాలను ప్రబోధిస్తున్నాయని చెప్పడం అగౌరవపరచడమే కాకుండా హిందూ విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడమే అవుతుంది. పవిత్ర గ్రంథాలను లక్ష్యంగా చేసిన ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు భారతదేశం అంతటా హిందువులతోపాటు దేశభక్తులను ఆగ్రహానికి గురిచేశాయి. ఆమె ప్రవర్తనను సోషల్ మీడియాలో నెటిజన్స్‌ ఏకిపారేస్తున్నారు. భారతీయుల ఐక్యతకు వ్యతిరేకమైన, విభజన ప్రకటనలు చేసినందుకు ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

ఇకపోతే.. ఆమె ఇలాంటి విషపూరిత ప్రవర్తనకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా, ఆమె తిరుపతి బాలాజీ, శ్రీరాముడు, సీత, బ్రాహ్మణులు, హిందువులు, ప్రధానమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు భారతదేశాన్ని కూడా ఎగతాళి చేసింది. జనసేన, బీజేపీ అధికారిక ప్రతినిధులు ఎప్పుడూ కూటమి భాగస్వాములపై ​​అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల గురించి బాధ్యతారహితంగా మాట్లాడలేదు. గాయత్రి ప్రవర్తన, దీనికి విరుద్ధంగా, కూటమి స్ఫూర్తిని పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. ఈ తన ప్రవర్తనతో ఎన్డీఏ మద్దతుదారుల్లో అసంతృప్తితోపాటు చీలికలకు కారణమవుతోంది. మూడు రోజుల క్రితం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులను కలిసిన తర్వాత.. ఎవరైనా భారత వ్యతిరేక మరియు అంతర్గత వ్యవహారాలపై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. హోం మంత్రి అనిత కూడా ఈ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థించారు. తాజాగా గాయత్రి కామెంట్స్‌ ఈ వైఖరిని ఉల్లంఘించడమే కాకుండా, ఆమె అహంకారాన్ని మరోసారి ఎత్తి చూపుతున్నాయి.

ఓవైపు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను బలంగా, సంపన్నంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మరోవైపు రాజధాని అభివృద్ధి చారిత్రాత్మక పునఃప్రారంభం కోసం అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. గాయత్రి ఇలాంటి పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా కాకుండా.. వాటిని టీడీపీ అధికారిక వ్యాఖ్యలుగా రూపొందించి.. జాతీయ స్థాయిలో పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఇకపోతే.. ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టుల్లో సీఎం చంద్రబాబుపై కూడా అభ్యంతకర కామెంట్స్‌ చేశారు. సీఎం చంద్రబాబును పదే పదే మిస్టర్‌ చంద్రబాబునాయుడు అంటూ సంబోధించడంపై కూడా టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు దేశంలోని సీనియన్‌ పొలిటీషియన్స్‌లో ఒకరు. అంతేకాకుండా నాలుగుసార్లు సీఎం. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏదో తన కొలీగ్‌ను సంబోధిస్తున్నట్లుగా మాట్లాడారు. టీడీపీ ప్రతిష్టను అవమానిస్తూ.. దెబ్బతీసే కార్యకలాపాలకు గాయత్రి పాల్పడటం నిజంగా దురదృష్టకరం. ఇకపోతే.. గాయత్రి పోస్టుల వైరల్‌గా మారిన నేపథ్యంలో టీడీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Advertisement

Latest News