పాకిస్థాన్ రెడీగా ఉంది: పాక్ ప్రధాని
తాజాగా జమ్మూకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెస్పాన్డ్ అయ్యారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఖైబర్ లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. పహల్గామ్ దాడిపై విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని ఆయన అన్నారు. అయితే దీనికి ముగింపు పలకాలన్నారు.
బాధ్యతాయుతమైన దేశంగా తమ పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఏదేమైనా తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూనే.. భారత్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అన్ని రకాల వీసాదారులైన పాకిస్థానీయులు వెళ్లిపోవాలని సూచించింది. అంతేకాకుండా అటారీ-వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన చర్యల దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మున్ముందు రోజుల్లో భారత్ ఇంకెలాంటి చర్యలు తీసుకుంటుందోనని పాకిస్తాన్ భయపడుతుంది.