గుజరాత్‌లో భారీగా అక్రమ వలసదారులు..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 1000 మందికిపైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్‌లో 890 మందిని, సూరత్‌లో 134 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి అన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు.
అయితే అక్కడ ఫోర్జరీ సర్టిఫికేట్స్ తో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. వీరిలో చాలా మంది డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు. రీసెంట్ గా నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు అల్‌ఖైదా స్లీపర్ సెల్స్‌తో కలిసి పనిచేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టామని, వీరందరి పత్రాలను పరిశీలించిన తర్వాత.. త్వరలోనే దేశం నుంచి పంపిస్తాం అని హర్ష్ సంఘవి తెలిపారు. ఇక, రాష్ట్రంలో పాక్ జాతీయులు ఎవరైనా ఉంటే.. కేంద్రం తీసుకున్న నిబంధనల ప్రకారం వారు కూడా వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.