పాక్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలి: గంగూలీ
2008 తర్వాత పాకిస్థాన్ కు టీమ్‌ఇండియా వెళ్లని సంగతి తెలిసిందే. చివరిసారిగా 2012 - 13లో భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య ద్వైపాకిక్ష సిరీస్ జరిగింది. అప్పట్నుంచి కేవలం న్యూట్రల్ వేదికల్లోనే తలపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడొద్దనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ కామెంట్స్ కి భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ తన సపోర్ట్ తెలిపాడు. ఇక నుంచి పాక్‌తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వందశాతం అంగీకరిస్తా. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. అది జరిగి తీరాలి. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదు అని గంగూలీ అన్నారు.
కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తుంటే.. డానిష్ కనేరియా మినహా పాకిస్థాన్ క్రికెటర్లు ఎవరూ రెస్పాన్డ్ కాలేదు. గత ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మాత్రం భారత్ పై ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. టోర్నీనే బహిష్కరించాలంటూ పెద్ద మాటలే చెప్పారు. ఇప్పుడు మాత్రం కనీసం ఖండిస్తూ ఒక్క ప్రకటన చేయలేదు. ఆ దేశ ప్రభుత్వంలా తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటం హైలెట్.