హైడ్రా అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్..!
కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు తొలగించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కృష్ణారావు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఐతే.. సభ జరగక ముందే హైడ్రా అధికారులు వాటిని తొలగించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్నా.. అధికారుల కంటికి కనిపించవా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభ జరగక ముందే ఫ్లెక్సీలు తీసేస్తారా అని నిలదీశారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప పార్టీల కోసం కాదని హితవు పలికారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు వడ్డీతోసహా అప్పజెప్పుతామని హెచ్చరించారు.