పాకిస్థానీయులను పంపేయాలని అమిత్ షా సూచన
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. విదేశాలు కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు కీలక చర్యలను చేపట్టింది. పాకిస్తాన్ కు జీవనాడి అయిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వెంటనే పంపించేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్థాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. దీంతో చాలా మంది అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాగా అమిత్ షా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అధికారులు పాకిస్థానీయుల కోసం జల్లెడ పడుతున్నారు. మంగళవారం పహల్గామ్‌లో ఉగ్రమూకల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. పాకిస్థాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ, వాఘా సరిహద్దును మూసేసింది.